చాట్రాయి ప్రెస్ క్లబ్ సమావేశం ఘనంగా నిర్వహణ ప్రెస్ క్లబ్ ప్రతినిధులకు ఘన సన్మానం జర్నలిస్టుల ఐక్యతే బలం.. వృత్తిపరమైన విలువలతో ముందుకు సాగాలి
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి: మండల కేంద్రమైన చాట్రాయిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చాట్రాయి ప్రెస్ క్లబ్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొమ్ము అర్జునరావు సభాధ్యక్షత వహించిన ఈ సమావేశంలో అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు వజ్రాల రాజ్కుమార్, కోశాధికారి నెల్లూరి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్మోహన్రెడ్డిలను సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల బాధ్యతలు, పత్రికా రంగం ప్రాధాన్యత, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పోషిస్తున్న పాత్ర తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను, అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజల అవసరాలను సమాజం దృష్టికి తీసుకురావడంలో విలేకరులు కీలక పాత్ర పోషిస్తున్నారని సమావేశంలో పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిర్మాణాత్మక జర్నలిజం దోహదపడాలని అభిప్రాయపడ్డారు. వార్తా సేకరణలో వాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ, వృత్తిపరమైన విలువలను కాపాడుకుంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. జర్నలిస్టుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడంలో చాట్రాయి ప్రెస్ క్లబ్ కీలక వేదికగా నిలుస్తుందని అన్నారు. వృత్తిపరంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విలేకరులపై వ్యక్తిగత కక్షసాధింపు చర్యలకు దూరంగా ఉండాలని, జర్నలిస్టులంతా ఒకే కుటుంబం అనే భావనతో పరస్పర గౌరవం, సహకారంతో వ్యవహరించాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన గౌరవం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇవి శ్రీనివాసరావు, మందపాటి సాంబిరెడ్డి, దుర్గం పుల్లారావు, మోపర్తి స్వామిదాసు, కాండ్రేగుల చంద్రశేఖర్, కంచర్ల మహేష్, గమిడిమెల్లి ప్రభాకర్, ఆడిమెల్లి లాజర్, కల్లేపల్లి రాజేష్ తదితర విలేకర మిత్రులు పాల్గొన్నారు.