చిత్తపూరు ఎంపీటీసీకి లిబరేషన్ అభ్యర్థి కలపాల జ్యోతి నామినేషన్
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చిత్తపూరు ఎంపీటీసీ జనరల్ మహిళ స్థానానికి సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి కలపాల జ్యోతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటిస్తూ స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఏలూరు జిల్లా కార్యదర్శి డి. పుల్లారావు, జిల్లా కమిటీ సభ్యుడు చాట్ల బాబూరావు, మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. రాష్ట్ర కమిటీ సభ్యులు డి. హరినాథ్, పరికల కళావతి, వేముల బక్కయ్య, దుర్గం పూజిత, భవాని తదితరులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డి. హరినాథ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. అయితే గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ వాటి అభివృద్ధిపై పాలకులు తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.
ఎన్డీఏ పాలనలో ప్రజలపై వేధింపులు కొనసాగుతున్నాయని, రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా పాలన సాగుతోందని పార్టీ నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన నిలిచే ప్రతినిధులు స్థానిక సంస్థల్లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
పేదల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని, మూడు నక్షత్రాల జెండా గుర్తుపై ఓటు వేసి కలపాల జ్యోతిని గెలిపించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.