కల్లూరు సర్పంచ్, ఉపసర్పంచ్ చెక్కు అధికారాలు ఆరు నెలలు నిలిపివేత
15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో అక్రమాలు జరిగినట్లు విచారణలో గుర్తింపు
రూ.5.85 లక్షల నిధులు కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఖాతాలకు మళ్లింపు
నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిర్మల్: నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామపంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో నిబంధనల ఉల్లంఘనలు, ఆర్థిక అక్రమాలు జరిగినట్లు విచారణలో గుర్తించడంతో సర్పంచ్, ఉపసర్పంచ్లపై చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్పంచ్ పెంట దశరథ్, ఉపసర్పంచ్ సూర్యవంశీ నారాయణ చెక్కు అధికారాలను తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆరు నెలలపాటు నిలిపివేసినట్లు వెల్లడించారు.
నిధుల మళ్లింపుపై విచారణ
కల్లూరు గ్రామపంచాయతీలో రూ.5,85,933 నిధులను నిబంధనలకు విరుద్ధంగా సర్పంచ్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు విచారణలో గుర్తించామని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం గ్రాంటు నిధుల నుంచి రూ.1,85,043ను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్లు విచారణ నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు.
గ్రామసభ ముందస్తు అనుమతి లేకుండా, కొటేషన్లు, టెండర్లకు సంబంధించిన నిబంధనలు పాటించకుండా పనులు చేపట్టినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ నిర్వహించినట్లు వివరించారు.
వివరణలు పరిశీలించిన అనంతరం చర్యలు
విచారణలో వెల్లడైన అంశాలపై సర్పంచ్ పెంట దశరథ్, ఉపసర్పంచ్ సూర్యవంశీ నారాయణకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వారు సమర్పించిన వివరణలను పరిశీలించిన అనంతరం అవి సంతృప్తికరంగా లేకపోవడంతోపాటు ఆర్థిక అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
పంచాయతీరాజ్ చట్టం, సంబంధిత నిబంధనల ప్రకారం సర్పంచ్తో పాటు చెక్కులపై ఉమ్మడి సంతకాలు చేసిన ఉపసర్పంచ్ చెక్కు అధికారాలను ఆరు నెలలపాటు నిలిపివేసినట్లు తెలిపారు.
అత్యవసర పనులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
గ్రామపంచాయతీలో అత్యవసర అవసరాలు, అభివృద్ధి పనుల కోసం గ్రామపంచాయతీ కార్యదర్శి, కుంటాల మండల పంచాయతీ అధికారి ఉమ్మడి సంతకాలతో నిధులను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. గ్రామంలో అవసరమైన పనులకు ఆటంకం కలగకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత తప్పనిసరి
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనలను సహించబోమని కలెక్టర్ భవేష్ మిశ్రా హెచ్చరించారు. ప్రజల సంక్షేమం కోసం కేటాయించిన ప్రతి రూపాయిని పారదర్శకంగా ఖర్చు చేయాలని, నిధుల వినియోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.