నవంబర్‌లోనే చింతలపూడి ఎత్తిపోతల పనులు ప్రారంభం
ఏలూరు జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు.. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి లక్ష్యం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి ఏలూరు జిల్లా: చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, వచ్చే నవంబర్‌లోనే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కూడా ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని, ఆ మేరకు నవంబర్‌లో పనులు మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీ స్పష్టం చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఏలూరు జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందుతుందని వివరించారు. ముఖ్యంగా చింతలపూడి, నూజివీడు నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంత రైతులకు ఈ ప్రాజెక్టు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. సాగునీటి లభ్యత పెరగడంతో రైతులు వ్యవసాయాన్ని మరింత విస్తరించుకునేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. కాలువల ద్వారా చెరువులను నింపడం వల్ల భూగర్భ జలమట్టాలు పెరిగి, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు కూడా గణనీయంగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని, వచ్చే ఏడాది ఆ ప్రాజెక్టును ప్రారంభించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు కూడా ప్రారంభం కానుండటం ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు శుభవార్త అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో చింతలపూడి ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ఏలూరు జిల్లాలో సాగునీరు, తాగునీటి కొరతను అధిగమించేందుకు వీలవుతుందని అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం సాకారం కావడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, అవసరమైన సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు, మంత్రి నారా లోకేష్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తించి తమ ఆశీర్వాదాలు అందించాలని పుట్టా మహేష్ కుమార్ కోరారు.