తిరువూరులో కాంగ్రెస్ ఎన్నికల వేగం.. అభ్యర్థులకు బీ ఫారాలు పంపిణీ
అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులకు ఎన్నికల పత్రాలు అందజేత.. చైర్మన్ అభ్యర్థి నల్లమోలు శ్రీనివాసరావుతో పాటు కౌన్సిలర్ అభ్యర్థులకు బీ ఫారాలు, ఫారం-9 అందజేత
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేసింది. అక్టోబర్ 28న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరువూరు పట్టణంలోని రాజీవ్ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చైర్మన్ అభ్యర్థి నల్లమోలు శ్రీనివాసరావుతో పాటు పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీ ఫారాలు, ఫారం-9 అందజేశారు. అన్ని పార్టీల కంటే ముందుగా తమ అభ్యర్థులకు ఎన్నికల పత్రాలను పంపిణీ చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అభ్యర్థులకు అవసరమైన పత్రాలను అందజేసి ఎన్నికలకు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. తిరువూరు మున్సిపాలిటీలో తమ పార్టీ అభ్యర్థులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నల్లమోలు శ్రీనివాసరావును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కౌన్సిలర్ అభ్యర్థులుగా 5వ వార్డు నుంచి కర్రె సంధ్య, 10వ వార్డు నుంచి గంధం శ్రీనివాస్, 20వ వార్డు నుంచి కుంచం దినేష్, 22వ వార్డు నుంచి దిద్దుకూరి ఆదిలక్ష్మి, 24వ వార్డు నుంచి చిన్నంశెట్టి నాగేశ్వరరావు బరిలో నిలవనున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు పట్టణ, మండల, జిల్లా స్థాయి నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.