పట్టభద్రుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని గెలిపించాలి: చిరుమర్తి లింగయ్య
NTODAY NEWS చిట్యాల:
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. శనివారం నల్లగొండ జిల్లా చిట్యాలలో పట్టణంలో ఆయన పట్టభద్రులను కలిసి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. అర్హులైన పలువురితో ఓటరు నమోదు చేయించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అర్హులైన పట్టభద్రులు ఓటరు జాబితాలో తమ పేరును పరిశీలించుకోవాలని, పేరు నమోదు కానివారు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని చిరుమర్తి లింగయ్య పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.