ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి: కే.బి.ఆర్. నాయుడు
- ఓటు బచావో–దేశ్ బచావో ఫేజ్-3 ప్రచారాన్ని విజయవంతం చేయాలి
- డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్
హనుమకొండ(ఎన్ టుడే న్యూస్): ప్రతి అర్హుడైన ఓటరుకు ఓటు హక్కు దక్కేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఏఐసీసీ పరిశీలకుడు కే.బి.ఆర్. నాయుడు పిలుపునిచ్చారు. ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన ‘ఓటు బచావో–దేశ్ బచావో’ ఫేజ్-3 ప్రచారాన్ని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ, వరంగల్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండలోని డీసీసీ భవన్‌లో ఈ ప్రచార మార్గదర్శకాల అమలుపై సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకుడు కే.బి.ఆర్. నాయుడు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు, కుడా చైర్మన్ గుండు సుధారాణి, మేరా కార్పొరేషన్ చైర్మన్ సంఘ్ వెంకటరాజ్యం, టీపీసీసీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ఉపాధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దొమ్మటి సాంబయ్య, టీపీసీసీ నియోజకవర్గ ఇన్‌చార్జి రవళి రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
ఈ సందర్భంగా కే.బి.ఆర్. నాయుడు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను నాయకులు, కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని అన్నారు. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ ద్వారా ఓట్ల తొలగింపు జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలు జరగకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటు హక్కు పరిరక్షణ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
తెలంగాణలో అభివృద్ధి దిశగా ప్రభుత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని కే.బి.ఆర్. నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.
ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రతి గ్రామం, వార్డులో ప్రచారం నిర్వహించాలి
వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ.. ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటమే లక్ష్యంగా చేపట్టిన ‘ఓటు బచావో–దేశ్ బచావో’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఏఐసీసీ, టీపీసీసీ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఫేజ్-3 ప్రచారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.