చిత్తపూరులో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఎన్నికల ప్రచారం
- మతోన్మాద శక్తులను ఓడిద్దాం.. రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం
- మూడు నక్షత్రాల గుర్తుపై ఓటు వేసి గెలిపించండి
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఏలూరు జిల్లా పరిషత్ చాట్రాయి అభ్యర్థిగా పోటీ చేస్తున్న దుర్గం పుల్లారావు, చిత్తపూరు ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్న కలపాల జ్యోతి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మతోన్మాద ఫాసిస్ట్ శక్తులను ఓడించాలని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని నినాదాలు చేశారు. విద్య, వైద్యం, ఉపాధి, గౌరవప్రదమైన జీవనం ప్రతి ఒక్కరికీ అందాలంటే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వ సాధన కోసం మార్క్స్, భగత్‌సింగ్, అంబేద్కర్, ఫూలే ఆశయాల బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని, పేదలకు కనీస నివాస గృహాలు కల్పించాలని, రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగుదల, ఉపాధి అవకాశాలు, పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని నాయకులు తెలిపారు. ప్రజల హక్కుల పరిరక్షణ, గ్రామాల సమగ్ర అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే ఎర్రజెండా బిడ్డలైన కామ్రేడ్లు దుర్గం పుల్లారావు, కలపాల జ్యోతికి మూడు నక్షత్రాల ఎన్నికల గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ చాట్రాయి మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు, వేముల బక్కయ్య, భవాని, పరికల కళావతి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.