తిరువూరు పోలీస్ స్టేషన్‌లో ఘనంగా దసరా ఆయుధ పూజ
తిరువూరు: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్‌లో దసరా ఆయుధ పూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. గురు ప్రకాష్, సబ్ ఇన్‌స్పెక్టర్ వి.ఎస్. శఠకర్ణి, మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ టి. గౌరేశ్వరి, పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ శాఖ విధుల్లో వినియోగించే ఆయుధాలు, వాహనాలు, ఇతర పరికరాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో మరింత అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. దసరా పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతిసౌభాగ్యాలను నింపాలని కోరుకున్నారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడంతో తిరువూరు పోలీస్ స్టేషన్‌లో పండుగ వాతావరణం నెలకొంది. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఆయుధ పూజ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ముగిసింది.