పెనుగొలను శివాలయంలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ
వైభవంగా దసరా ఉత్సవాలు.. చండీ హోమం, అన్నదానం నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు గురువారం పార్వతీదేవిని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ అర్చకులు దాములూరి సత్యనారాయణ శర్మ, వేద పండితులు ఇంద్రగంటి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు, రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి, శ్రీ మహాకాళి మూల మంత్రాలను పారాయణం చేస్తూ చండీ హోమం నిర్వహించారు. ఆవు నెయ్యితో పాటు వివిధ రకాల హోమ ద్రవ్యాలు, పండ్లను హోమగుండంలో సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కీర్తిశేషులు పొట్టి రాజయ్య, నాగరత్నమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి మనవళ్లు విజయకుమార్, నాగరాజు ఆర్థిక సహకారంతో భక్తులకు అన్నదానం నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.