ఎస్సీఓ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తజకిస్తాన్ పర్యటన
దుషాంబేలో అక్టోబర్ 19, 20 తేదీల్లో 25వ సమావేశం.. వాణిజ్యం, ఆర్థిక సహకారం, అనుసంధానతపై చర్చలు
న్యూఢిల్లీ (ఎన్ టుడే న్యూస్): షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) ప్రభుత్వాధినేతల మండలి 25వ సమావేశంలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తజకిస్తాన్ పర్యటనకు వెళ్లనున్నారు. తజకిస్తాన్ రాజధాని దుషాంబేలో అక్టోబర్ 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో ఎస్సీఓ సభ్య దేశాల మధ్య బహుళపక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించనున్నారు. వాణిజ్యం, ఆర్థిక రంగం, పెట్టుబడులు, రవాణా అనుసంధానత, నూతన ఆవిష్కరణలు, సాంస్కృతిక, మానవతా సంబంధాల అభివృద్ధి వంటి అంశాలు చర్చకు రానున్నాయి.
సభ్య దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న సహకార కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంతో పాటు, సంస్థ ఆర్థిక, సంస్థాగత కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఎస్సీఓ వేదికగా ఇతర సభ్య దేశాలతో అభిప్రాయాలను పంచుకుంటూ, పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ ఈ సమావేశాన్ని ఉపయోగించుకోనుంది. స్టార్టప్లు, నూతన ఆవిష్కరణలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతం వంటి రంగాల్లో భారత్ చేపడుతున్న కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశం ఉంది.