2027 గోదావరి పుష్కరాల నాటికి పుణ్యక్షేత్రాల బస్‌స్టేషన్ల అభివృద్ధి
ధర్మపురికి బస్ డిపో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచన
ధర్మపురి | ఎన్ టుడే న్యూస్:
1993లో ప్రారంభమైన ధర్మపురి బస్‌స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా రెండు ప్లాట్‌ఫారాల విస్తరణ, గ్రానైట్ ఫ్లోరింగ్, కొత్త టాయిలెట్ బ్లాక్, సీసీ పేవ్‌మెంట్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని ప్రధాన పుణ్యక్షేత్రాల బస్‌స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ధర్మపురిలో బస్ డిపో ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని సేకరించి, ప్రతిపాదనలు పంపించాలని అధికారులను కోరినట్లు వెల్లడించారు. ధర్మపురి నుంచి ముంబైకి బస్సు సర్వీసు ప్రారంభించడంతో పాటు కరీంనగర్–జగిత్యాల–ధర్మపురి మార్గంలో రాత్రి బస్సులు నడిపేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.13 వేల కోట్ల ఆదా
మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు 367 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు చేసి, దాదాపు రూ.13 వేల కోట్లు ఆదా చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు చేరేలా, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ సేవలను విస్తరిస్తూ, ధర్మపురి ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.