డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు
ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు నిర్ణయం హర్షణీయం: మేఘవత్ రెడ్యా నాయక్
నారాయణపూర్ | ఎన్ టుడే న్యూస్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటిని అందించే నిర్ణయం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవ, నిరంతర కృషి వల్లే సాధ్యమైందని నారాయణపూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మేఘవత్ రెడ్యా నాయక్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, రైతుల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
60 రోజుల్లో 30 టీఎంసీల నీటి తరలింపు లక్ష్యం
సాగునీటి ప్రాజెక్టులపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పలుమార్లు నిర్వహించిన సమీక్షల నేపథ్యంలో ఏదుల రిజర్వాయర్ నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల పాటు మొత్తం 30 టీఎంసీల నీటిని డిండి ప్రాజెక్టుకు అందించే నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని మేఘవత్ రెడ్యా నాయక్ తెలిపారు. ప్రాజెక్టు పనులను ప్రారంభించి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడం హర్షణీయమన్నారు.
మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం
డిండి ప్రాజెక్టు పనులు పూర్తయితే చర్లగూడెం రిజర్వాయర్ వరకు నీరు చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందడంతో పాటు ప్రజల తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో నీటి సౌకర్యం మెరుగుపడి రైతుల కష్టాలు తగ్గుతాయని, స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు
ఈ నిర్ణయానికి సహకరించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మేఘవత్ రెడ్యా నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.