ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
- తొట్టంబేడు మండల కార్యాలయాల్లో తనిఖీ
- ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం
- భద్రతపై ప్రత్యేక దృష్టి
తొట్టంబేడు, తిరుపతి జిల్లా | ఎన్ టుడే న్యూస్: స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మూడో రోజు శుక్రవారం తొట్టంబేడు మండల కార్యాలయాల్లో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీకాళహస్తి డీఎస్పీ పావని, తొట్టంబేడు తహసీల్దార్ భారతి, పోలీసు శాఖ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.