నస్పూర్ పీహెచ్సీలో డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ
చేతుల పరిశుభ్రతతోనే అంటువ్యాధుల నివారణ
నస్పూర్, అక్టోబర్ 15: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ నరేంద్ర రాథోడ్ సూచించారు. గురువారం నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) ఆకస్మికంగా సందర్శించిన ఆయన రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, అసంక్రమిత వ్యాధుల (ఎన్సీడీ) సర్వే తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్షల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, అవసరమైన వారికి క్రమం తప్పకుండా మందులు అందించాలని ఆదేశించారు. ప్రతి ఓపీ కేసుకు ఆధార్ను అనుసంధానించాలని, ఔషధాల వివరాలను ‘ఈ-ఔషధి’ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు.
స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వారంలో రెండు రోజులు తప్పనిసరిగా ‘డ్రై డే’ పాటించాలని చెప్పారు.
గర్భిణుల వివరాలను ఎంసీహెచ్ పోర్టల్లో నమోదు చేయాలని, ప్రభుత్వం అందించే 108, అమ్మ ఒడి వాహనాల సేవలను వినియోగిస్తూ అవసరమైన స్కానింగ్ పరీక్షలు, సురక్షిత ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీని పరిశుభ్రంగా ఉంచి, సంబంధిత ఫొటోలను అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
చేతుల పరిశుభ్రతపై అవగాహన అవసరం
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ చేతులను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి డయేరియా, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు.
ఆహారం తీసుకునే ముందు, మలవిసర్జన అనంతరం సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. గ్రామసభలు, క్షేత్రస్థాయి సమావేశాల ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, నర్సింగ్ అధికారి కవిత, ఎంఎల్హెచ్పీలు, వైద్యులు, ఆశా కార్యకర్తలు, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.