డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
ఫ్లోరైడ్ బాధితులు, కరువు రైతుల కష్టాలను గుర్తించాలి
కృష్ణా జలాలను అన్నదమ్ముల్లా పంచుకుందాం: రాచకొండ జలసాధన కమిటీ నాయకులు
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 17: దశాబ్దాలుగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న ప్రజలు, కరువుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల కష్టాలను గుర్తించి డిండి ఎత్తిపోతల పథకం అమలుకు సహకరించాలని రాచకొండ జలసాధన కమిటీ నాయకులు మందుగుల బాలకృష్ణ, ఏపూరి సతీష్ కోరారు. ఈ పథకానికి సంబంధించి పాలమూరు ప్రాంత నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తీరుపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో స్థానిక రైతులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ, మునుగోడు ప్రాంత రైతులు సాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరోవైపు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తాగునీటి అవసరాలు కూడా పూర్తిస్థాయిలో తీరాల్సి ఉందన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో డిండి ఎత్తిపోతల పథకం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.
కరువు పరిస్థితుల కారణంగా మునుగోడు ప్రాంతంలో వ్యవసాయం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని, సాగునీరు అందుబాటులో లేక రైతులు నష్టపోతున్నారని నాయకులు అన్నారు. ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడం అత్యవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో డిండి ఎత్తిపోతల పథకం విషయంలో ప్రాంతాల మధ్య విభేదాలు పెంచకుండా, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు పాలమూరు–రంగారెడ్డి పథకంలోని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయానికి పాలమూరు ప్రాంత నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు అడ్డుపడటం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
డిండి పథకంపై విద్వేషాలు, ప్రాంతీయ విభేదాలు పెంచుకోవడం వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదని కమిటీ నాయకులు అన్నారు. కృష్ణా నది జలాలను అన్నదమ్ముల్లా పరస్పర సహకారంతో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పాలమూరు ప్రాంత ప్రజల నీటి అవసరాలను గౌరవిస్తూనే, ఫ్లోరైడ్ బాధితులు, కరువు రైతుల సమస్యలకు కూడా పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రజాపాలన ప్రభుత్వం డిండి పథకం విషయంలో సానుకూలంగా ఉన్నప్పుడు, దానికి అడ్డంకులు సృష్టించకుండా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. సాగునీరు, తాగునీటి కోసం ప్రజలు ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలని ప్రశ్నించారు. పథకం అమలుకు అవసరమైన చర్యలు ముందుకు సాగేందుకు స్థానిక రైతులు, ప్రజలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
డిండి ఎత్తిపోతల పథకం అమలయ్యే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించినట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక రైతులు, ప్రజలు పాల్గొన్నారు.