ఎన్నికల కోసం పల్లెల్లో ఐక్యతను దెబ్బతీయొద్దు
గుండు గొలనులో పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికల అవగాహన సదస్సు
ఏలూరు జిల్లా, భీమడోలు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భీమడోలు పోలీసుల ఆధ్వర్యంలో గుండు గొలను గ్రామంలో ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ సూచనల మేరకు భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్సై మదీనా బాషా స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో సహజమైన ప్రక్రియ అని, ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల కోసం గ్రామాల్లో రాజకీయ విభేదాలు పెంచుకుని పరస్పర వైషమ్యాలకు దిగవద్దని పోలీసులు సూచించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా గ్రామస్తులంతా కలిసిమెలిసి జీవించాలని, పల్లెల్లో ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో శాంతిభద్రతలు, ప్రజల మధ్య సత్సంబంధాలు ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, నిర్భయంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో బాధ్యతాయుతంగా పాల్గొనాలని సూచించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించినా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు గ్రామస్తులు సంయమనం పాటిస్తూ పోలీసు, ఇతర అధికారులకు సహకరించాలని, గుండు గొలను గ్రామంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.