పెనుగొలను శివాలయంలో వైభవంగా దసరా ఉత్సవాలు
ఏడో రోజు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఏడో రోజు శ్రీ పార్వతీదేవిని శ్రీ మహాలక్ష్మి అలంకారంలో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ అర్చకులు దాములూరి సత్యనారాయణ శర్మ, వేద పండితులు ఇంద్రగంటి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు, రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి, శ్రీ మహాకాళి స్వరూపిణి అయిన శ్రీ చండీమాతకు సంబంధించిన వేద మంత్రాలను పారాయణం చేస్తూ చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. పలువురు దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కీర్తిశేషులు వెచ్చా సూర్య ప్రకాశరావు, రాజేశ్వరి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుల సహకారంతో భక్తులకు అన్నదానం నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.