ఓబీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్
ఓబీసీ మోర్చా నూతన జిల్లా కమిటీ ప్రకటన
మంచిర్యాల : జిల్లాలో ఓబీసీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి కమిటీ బాధ్యులు నిరంతరం కృషి చేయాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల అశోక్ వర్ధన్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, ఓబీసీ మోర్చా నూతన జిల్లా కమిటీని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతంతో పాటు ఓబీసీ వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలన్నారు.
ఓబీసీల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల ముఖేశ్‌గౌడ్, నాయకులు ఎంగందుల కృష్ణమూర్తి, పట్టి వెంకటకృష్ణ, రమణారావు, రాచర్ల సంతోష్, మద్దర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు