భారత ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి*
తెలంగాణ
/
రంగారెడ్డి
ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఓటర్ల జాబితా సవరణపై ప్రజా సంఘాల నిరసన..
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్
సైదాబాద్ (ఎన్ టుడే న్యూస్): భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సౌత్ ప్రజా సంఘాల కమిటీ ఆధ్వర్యంలో ఐఎస్ సదన్, సంతోష్‌నగర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు, ఈ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ, గిరిజన సంఘం, అవాజ్, కేవీపీఎస్ తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు.
ఓటు హక్కును కాపాడాలి
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం. శ్రవణ్ కుమార్, ఐద్వా జిల్లా కార్యదర్శి పి. శశికళ, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎం. బాలు నాయక్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఏ. కృష్ణ, కేవీపీఎస్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.
ఎస్‌ఐఆర్ పేరుతో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ఓటు హక్కుతో పాటు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు
దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించారంటూ నాయకులు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టేందుకు ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రభుత్వ విధానాలను విమర్శించిన నాయకులు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రజా సంఘాల తరఫున పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యవాదులు, నిరసనకారులపై దాడులు చేయడం సరికాదని, ఇలాంటి ఘటనలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా సంఘాల నాయకుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు మీనా, అబ్దుల్ లతీఫ్, ఎస్. కిషన్, వి. రాంకుమార్, ఎల్. కోటయ్య, జ్యోతి, కవిత, స్వరూప, హాజీ తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు.