గుడివాడలో ఎక్సైజ్ అధికారుల దాడులు..
54 మద్యం సీసాలు స్వాధీనం ఎన్నికల నేపథ్యంలో గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఆకస్మిక తనిఖీలు
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం నిల్వలు, విక్రయాల నియంత్రణకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. అక్టోబర్ 25న అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారి సీహెచ్. లావణ్య ఆదేశాల మేరకు విజయవాడ ఎన్ఫోర్స్‌మెంట్ బృందాలు గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో గుడ్లవల్లేరు మండలానికి చెందిన పంచుమర్తి సురేష్ వద్ద 54 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ పి. వెంకటేశ్వరమ్మ తెలిపారు. ఎన్నికల సమయంలో మద్యం అక్రమ నిల్వలు, విక్రయాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలను అడ్డుకోవడంతో పాటు నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో ఎన్ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ జి. ఆనంద్, హెడ్ కానిస్టేబుల్ పి. చెన్నారావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్రమ మద్యం రవాణా, నిల్వలు, విక్రయాలపై తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.