అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్లు.. వెయ్యి మందికి పైగా మోసం
సుమారు రూ.26.16 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు.. పోలీసు అధికారులు, వైద్యులు, వ్యాపారవేత్తలూ బాధితులే
హైదరాబాద్: సోషల్ మీడియాలో అమ్మాయిల పేర్లు, ఫొటోలతో నకిలీ ఖాతాలు సృష్టించి, యువకులు, పురుషులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలపై 23 ఏళ్ల యువకుడిని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు దాదాపు వెయ్యి మందిని మోసం చేసి, నాలుగేళ్లలో సుమారు రూ.26.16 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన కె. పవన్ కుమార్ (23) గతంలో పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేసి మానేశాడు. ప్రస్తుతం కూకట్‌పల్లిలో నివసిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 13, ఫేస్‌బుక్‌లో 14 నకిలీ ఖాతాలను అమ్మాయిల పేర్లు, ఫొటోలతో సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఖాతాల ద్వారా యువకులు, పురుషులకు అమ్మాయిగా పరిచయం చేసుకుని వారితో పరిచయాలు పెంచుకునేవాడు. అనంతరం వారి వ్యక్తిగత వివరాలు, అభ్యంతరకరమైన ఫొటోలను సేకరించేవాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తాను ఆ అమ్మాయి సోదరుడినంటూ బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని ఆరోపించారు. మరికొందరి నుంచి పెట్టుబడుల పేరుతో నగదు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ మోసాలకు పోలీసు అధికారులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, గిగ్ వర్కర్లు కూడా బాధితులయ్యారు. ఇన్‌స్పెక్టర్లు, అదనపు డీసీపీలతో సహా 14 మంది పోలీసు సిబ్బంది బాధితుల జాబితాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ బాధితులు ఉన్నట్లు వెల్లడించారు.
నకిలీ ఖాతాల కోసం కోల్‌కతాకు చెందిన ఓ యువ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫొటోను ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టి పవన్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.
నిందితుడి నుంచి మూడు సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలు, బాధితుల సంఖ్య, ఇతర ప్రాంతాల్లో నమోదైన ఫిర్యాదులపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.