తిరువూరు మున్సిపల్ ఎన్నికల వేళ ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించుకోవాలి
తిరువూరు మున్సిపల్ ఎన్నికల వేళ ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించుకోవాలి రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆర్డీఓ ఏ. కుమార్ సూచన
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆర్డీఓ సూచించారు. తిరువూరు పట్టణంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ఉంటే సంబంధిత పార్టీల ప్రతినిధులు స్వచ్ఛందంగా వాటిని తొలగించుకోవాలని కోరారు. అలా తొలగించని పక్షంలో మున్సిపాలిటీ సిబ్బందితో వాటిని తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఎన్నికల నిర్వహణలో అధికారులకు, సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తిరువూరు నగర పంచాయతీ కమిషనర్తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.