ఫుట్ పెట్రోలింగ్‌తో ప్రజల్లో భద్రతా భావం పెంపు
ఫుట్ పెట్రోలింగ్‌తో ప్రజల్లో భద్రతా భావం పెంపు మైనర్ల వాహన డ్రైవింగ్‌పై పోలీసుల కౌన్సెలింగ్
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు సబ్ డివిజన్ పరిధిలోని ఆగిరిపల్లి మండలంలో ఎస్ఐ వి. సురేష్ పోలీసు సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, నూజివీడు రూరల్ సీఐ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు రహదారి భద్రత, ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగంతో వాహనాలు నడపకూడదని ఎస్ఐ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని, ‘వేగం వద్దు.. ప్రాణం ముద్దు’ అనే నినాదాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. ఫుట్ పెట్రోలింగ్ సందర్భంగా మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఘటనలను గుర్తించి, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలతో పాటు చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయని వివరించారు. గ్రామాల్లో పోలీసుల ఉనికిని చాటడంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు, నేరాల నివారణకు విజిబుల్ పోలీసింగ్ దోహదపడుతుందని ఎస్ఐ తెలిపారు. ప్రతి వాహనదారుడు తమ కోసం ఒక కుటుంబం ఎదురుచూస్తోందనే విషయాన్ని గుర్తుంచుకొని, జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.