గంపలగూడెంలో నేత్రదాన సేవా కార్యక్రమం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం గ్రామానికి చెందిన చిన్నంశెట్టి ఏసుబాబు (40) సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి 2 గంటలకు మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న గంపలగూడెం లయన్స్ క్లబ్ సభ్యులు కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానం ఆవశ్యకత, ప్రాధాన్యతను వివరించారు.
నేత్రదానం ద్వారా మరో వ్యక్తి జీవితంలో వెలుగులు నింపవచ్చని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీనికి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వారి సమ్మతితో విజయవాడ డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి సాంకేతిక బృందం ఏసుబాబు నేత్రాలను విజయవంతంగా స్వీకరించింది.
ఈ కార్యక్రమంలో గంపలగూడెం లయన్స్ క్లబ్ కార్యదర్శి కొండా నాగిరెడ్డి పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల సమ్మతితో నేత్రదానం చేయడం ద్వారా మానవతా విలువలను చాటిన చిన్నంశెట్టి ఏసుబాబు కుటుంబ సభ్యులకు లయన్స్ క్లబ్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపిన కుటుంబ సభ్యుల సేవాభావాన్ని అభినందించారు.