ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
* సీపీఎం, రైతు సంఘం నాయకుల డిమాండ్
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు అవిశెట్టి శంకరయ్య, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు అరూరి శ్రీను డిమాండ్ చేశారు. శనివారం చిట్యాల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, మండల రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పంట కోసి 20 రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు. ధాన్యం కుప్పల వద్ద రైతులు పడిగాపులు కాస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారుల బెడద పెరిగి రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్షాలు కురుస్తాయనే ఆందోళనతో రైతులు ఇతర వ్యవసాయ పనులను పక్కనపెట్టి అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, రైతు సంఘం జిల్లా, మండల నాయకులు ఐతరాజు నర్సింహా, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, పాలమాకుల అర్జున్, బెలిజ మల్లయ్య, అరూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.