పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు దరఖాస్తు తేదీ నుంచే బకాయిలు చెల్లించాలని ఆదేశం
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన వితంతు మహిళకు పింఛన్ బకాయిలు చెల్లించాలని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పింఛన్ మంజూరులో అధికారుల జాప్యానికి ఎన్నికల కోడ్ వంటి కారణాలను సాకుగా చూపడం సరికాదని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులు అందిన ఎనిమిది వారాల్లోగా బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. కొత్తపాలెం గ్రామానికి చెందిన తాడిశెట్టి తిరుపతమ్మ భర్త హరికృష్ణ దివ్యాంగుల పింఛన్ పొందుతూ 2023 జులైలో అనారోగ్యంతో మరణించారు. అనంతరం తిరుపతమ్మ వితంతు పింఛన్ కోసం 2024 మార్చి 16న దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధికారులు ఆమెకు 2026 ఫిబ్రవరి నుంచి మాత్రమే పింఛన్ మంజూరు చేశారు. దీంతో దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి పింఛన్ మంజూరయ్యే వరకు చెల్లించాల్సిన బకాయిలను ఇప్పించాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్ దరఖాస్తులను 21 పనిదినాల్లోగా పరిష్కరించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అధికారులు సకాలంలో స్పందించకుండా జాప్యం చేసి, అనంతరం ఎన్నికల కోడ్ వంటి కారణాలను సాకుగా చూపడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద 2024 జులై 1 నుంచి మూడు నెలల బకాయిలతో కలిపి పింఛన్ చెల్లించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోను కూడా న్యాయస్థానం ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచే పింఛన్ బకాయిలు పొందేందుకు అర్హురాలని హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఉత్తర్వులు అందిన ఎనిమిది వారాల్లోగా సంబంధిత అధికారులు బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు పింఛన్ మంజూరులో జాప్యాన్ని ఎదుర్కొంటున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.