అక్రమ బెల్టు షాపులను వెంటనే మూసివేయాలి
తెలంగాణ
బాలానగర్: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ గ్రామంలో విచ్చలవిడిగా నడుస్తున్న అక్రమ బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలని కోరుతూ బాలానగర్ గ్రామస్థులు, వార్డ్ మెంబర్ రొయ్యల సతీష్ సోమవారం ప్రజా వాణిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో ) అనిల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, దీనివల్ల మందుబాబులు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టిస్తున్నారని వాపోయారు. మహిళలు, విద్యార్థినులు బయటకు రావడానికి తీవ్ర భయాందోళనలు చెందుతున్నారని తెలిపారు. అధికారుల సమన్వయంతో అక్రమ బెల్ట్ షాపులను వెంటనే తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని గ్రామస్థులు స్పష్టం చేశారు.