నూజివీడు మున్సిపాలిటీలో 36కు 36 వార్డులు గెలవాలి
కూటమి అభ్యర్థులకు మంత్రి కొలుసు పార్థసారథి పిలుపు
నూజివీడు మున్సిపాలిటీలో 36కు 36 వార్డులు గెలవాలి కూటమి అభ్యర్థులకు మంత్రి కొలుసు పార్థసారథి పిలుపు శివాలయంలో ప్రత్యేక పూజలు.. కూటమి అభ్యర్థులకు నామినేషన్ పత్రాల అందజేత
నూజివీడు, అక్టోబరు 17: నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలోని 36 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజయాన్ని కానుకగా అందించాలని కోరారు.
నూజివీడు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో శనివారం పట్టణంలోని పాతపేట శివాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కూటమి నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన పాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా నూజివీడు పట్టణంలో అభివృద్ధి జరిగిందని మంత్రి పేర్కొంటూ, ఆ అభివృద్ధిని కొనసాగించేందుకు ప్రజలు కూటమికి మద్దతుగా నిలవాలని కోరారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, కౌన్సిలర్ అభ్యర్థులంతా కలిసికట్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని విజయానికి కృషి చేయాలని సూచించారు.
వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా కూటమి లక్ష్యాన్ని ముందుంచుకుని ప్రతి వార్డులో ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. సమిష్టి కృషితో నూజివీడు మున్సిపాలిటీలో కూటమి విజయాన్ని సాధించి పట్టణంలో తెలుగుదేశం జెండా ఎగురవేయాలని ఆకాంక్షించారు. ఎన్నికల బరిలో నిలుస్తున్న సోదరీమణులు, సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ విజయం సాధించే దిశగా కృషి చేయాలని కోరారు. కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.