స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో ముమ్మర తనిఖీలు
జిల్లా వ్యాప్తంగా 9 ప్రధాన చెక్‌పోస్టులు ఏర్పాటు.. 24 గంటల పాటు పహారా
సరైన పత్రాలు లేకుండా నగదు, విలువైన వస్తువులు తరలిస్తే కఠిన చర్యలు: ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లె: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉపయోగించే వస్తువుల రవాణాను అరికట్టేందుకు అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జిల్లాలోకి ప్రవేశించే సరిహద్దు మార్గాల్లో 9 ప్రధాన చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, పోలీసులతో పాటు రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. తనిఖీల కోసం ఏపీఎస్పీ ప్రత్యేక బలగాలను కూడా రంగంలోకి దించారు. స్థానిక భౌగోళిక పరిస్థితులు, అటవీ మార్గాలపై అవగాహన ఉన్న స్థానిక గైడ్‌ల సహకారంతో సిబ్బంది పనిచేస్తున్నారు. వివిధ శాఖల సిబ్బందిని షిఫ్టుల వారీగా నియమించి 24 గంటల పాటు నిరంతర పహారా నిర్వహిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను జీపీఎస్ కెమెరాల ద్వారా జిల్లా కేంద్రం నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
సరిహద్దుల్లో 9 చెక్‌పోస్టులు
అక్రమ నగదు, మద్యం, ఇతర ప్రలోభాల వస్తువులు జిల్లాలోకి ప్రవేశించకుండా సరిహద్దు మార్గాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమ మద్యం, నగదు రవాణాను అడ్డుకునేందుకు ఆ సరిహద్దు మార్గంలో మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కడప జిల్లా వైపు నుంచి వచ్చే వాహనాల తనిఖీకి రెండు, చిత్తూరు జిల్లా సరిహద్దులో మరో రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. తిరుపతి–చిత్తూరు జిల్లాల ఉమ్మడి సరిహద్దు మార్గంలో ఒకటి, శ్రీ సత్యసాయి జిల్లా సరిహద్దులో మరొక చెక్‌పోస్టును ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు.
ప్రజలు సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలి
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. వ్యాపార, వ్యక్తిగత అవసరాలు లేదా శుభకార్యాల కోసం పెద్ద మొత్తంలో నగదు, విలువైన వస్తువులు తీసుకెళ్లేవారు ఏటీఎం రసీదులు, బ్యాంకు పత్రాలు, కొనుగోలు బిల్లులు లేదా ఇతర సంబంధిత ఆధారాలను వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
చెక్‌పోస్టుల వద్ద పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించే తనిఖీలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం లేదా ఇతర వస్తువులను అక్రమంగా తరలిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.