గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన జగన్.. దాడులపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం
మిథున్ రెడ్డి, గురుమూర్తి సహా వైసీపీ నేతలపై దాడుల అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే యోచన
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గవర్నర్కు ఫిర్యాదు చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులపై జరిగినట్లు చెబుతున్న దాడుల అంశాలను జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఈ ఘటనలపై ఫిర్యాదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాయచోటిలో వైసీపీ కార్యాలయం దగ్ధమైన ఘటనతో పాటు పులివెందులలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనను కూడా గవర్నర్కు వివరించనున్నట్లు తెలుస్తోంది.
అయితే, గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైందా, భేటీ ఏ సమయంలో జరగనుంది అనే అంశాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.