ఆపదలో ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా జల్లెపల్లి పరమేశ్వరరావు బాబావలి
ఆపరేషన్‌కు రూ.10 వేల ఆర్థిక సాయం
చాట్రాయి: కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడం, ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం నిజమైన మానవత్వానికి నిదర్శనం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ ఆటో డ్రైవర్ కుటుంబానికి జల్లెపల్లి పరమేశ్వరరావు అండగా నిలిచి తన ఉదారతను చాటుకున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బాబావలికి ప్రమాదం జరగడంతో మోకాలికి తీవ్ర గాయమైంది. ప్రమాదం అనంతరం మోకాలికి నిర్వహించిన ఆపరేషన్ విఫలమవడంతో ఆయన పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. దీనికి తోడు కాలికి ఇన్ఫెక్షన్ సోకడంతో ఆరోగ్య సమస్యలు తీవ్రతరమయ్యాయి. ఇన్ఫెక్షన్ సోకిన కాలికి మరోసారి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ప్రమాదం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి మరో ఆపరేషన్ ఖర్చులు భారంగా మారాయి. ఆటో నడుపుతూ జీవనం సాగించే బాబావలి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కుటుంబానికి ఆర్థిక సమస్యలు మరింత భారంగా మారాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చిన జల్లెపల్లి పరమేశ్వరరావు రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఆపదలో ఉన్న సమయంలో అందించిన ఈ సాయం బాబావలి కుటుంబానికి కొంత ఊరటనిచ్చింది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, అవసరమైన సమయంలో ఆర్థికంగా చేయూతనివ్వడం సమాజంలో మానవతా విలువలకు నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. బాధిత కుటుంబానికి ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించిన జల్లెపల్లి పరమేశ్వరరావు ఔదార్యాన్ని పలువురు అభినందిస్తున్నారు.