కడవరకు కమ్యూనిస్టుగా జీవించిన జిట్ట నర్సింహా
రైతులు, కూలీల సమస్యల పరిష్కారానికి విశేష కృషి
పేద కుటుంబంలో జన్మించి, జీవితాంతం కమ్యూనిస్టుగా కొనసాగిన సీపీఎం సీనియర్ సభ్యుడు కామ్రేడ్ జిట్ట నర్సింహా (75) సేవలు మరువలేనివని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాల పట్టణానికి చెందిన జిట్ట నర్సింహా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సోమవారం చిట్యాల పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న నర్సింహా నివాసానికి వెళ్లిన చెరుపల్లి సీతారాములు, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం నర్సింహా భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. సీపీఎం తరఫున సింగిల్ విండో డైరెక్టర్‌గా ఎన్నికైన జిట్ట నర్సింహా రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ అభివృద్ధికి, ప్రజా ఉద్యమాలకు అందించిన ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, మండల నాయకులు శీలా రాజయ్య, జిట్ట స్వామి, ఏళ్ల మారయ్య, బండారు శంకరయ్య, రుద్రారపు పెద్దులు, నర్సింహా, ప్రతాపరెడ్డి, బక్కమ్మ, గోపాలు, డేవిడ్ తదితరులు పాల్గొని కామ్రేడ్ జిట్ట నర్సింహాకు నివాళులర్పించారు.