కలగర ఎంపీటీసీ అభ్యర్థిగా మేకల కుమారి నామినేషన్ దాఖలు
గ్రామీణ సమస్యల పరిష్కారమే లక్ష్యమంటూ వెల్లడి
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట: కలగర ఎంపీటీసీ జనరల్ మహిళ స్థానానికి సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకురాలు మేకల కుమారి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి. హరినాథ్ ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత నేడు ఎంతో ఉందని వారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, పారిశుధ్య లోపం, తాగునీటి కొరత, అధ్వానంగా ఉన్న రహదారులు, విద్యా, వైద్య సదుపాయాల లేమి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సమస్య మరింత తీవ్రంగా మారుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో కనీస అవసరాలైన తాగునీరు, పారిశుధ్యం, రహదారుల విషయంలో తగిన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని మేకల కుమారి పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి స్థానిక సంస్థలు క్రియాశీలకంగా పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే అభ్యర్థులను ఆదరించాలని కోరుతూ, మూడు నక్షత్రాల గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని మేకల కుమారి విజ్ఞప్తి చేశారు.