కుప్పంలో శ్రీమహాలక్ష్మి దీపపూజలో పాల్గొన్న నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన శ్రీమహాలక్ష్మి దీపపూజ కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. మంగళవారం కుప్పం చెరువు కట్ట సమీపంలో టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్‌వీ భక్తి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన దీపపూజలో భువనేశ్వరి భక్తులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలను వెలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
పూజల అనంతరం అమ్మవారికి సమర్పించిన పసుపు సూత్రాలు, కంకణాలు, ప్రసాదాలను పండితులు, టీటీడీ అధికారులు భువనేశ్వరికి అందజేశారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన శ్రీమహాలక్ష్మి దీపపూజతో కుప్పంలో పండుగ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.