స్థానిక ఎన్నికల వేళ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌తో నేతల వరుస భేటీలు
- జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ.. టికెట్లు, సమన్వయంపై చర్చలు
- స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేటే లక్ష్యంగా పనిచేయాలి
ఏలూరు: స్థానిక సంస్థల ఎన్నికలు కీలక దశకు చేరుకోవడంతో ఏలూరు పార్లమెంట్ పరిధిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుండగా, పలు మండలాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌ను కూటమి పార్టీలకు చెందిన పలువురు నాయకులు వరుసగా కలుస్తున్నారు. గత రెండు రోజులుగా ఎంపీ నివాసం వద్ద రాజకీయ సందడి నెలకొనగా, శుక్రవారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి సహా పలువురు నేతలు ఎంపీతో భేటీ అయ్యారు.
బడేటి చంటితో 45 నిమిషాల పాటు చర్చలు
శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను ఆయన నివాసంలో కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, టికెట్లు ఆశిస్తున్న నాయకులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలపై ఇరువురు నేతలు దాదాపు 45 నిమిషాల పాటు చర్చించినట్లు సమాచారం.
మేయర్ అభ్యర్థికి ఎంపీ శుభాకాంక్షలు
శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా కూటమి తరఫున బరిలో ఉన్న జనసేన నాయకుడు రెడ్డి అప్పలనాయుడు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా మేయర్ ఎన్నికల్లో రెడ్డి అప్పలనాయుడు విజయం సాధించాలని ఆకాంక్షించిన ఎంపీ, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
జడ్పీ చైర్మన్ పదవిపై నేతల మంతనాలు
మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఉంగుటూరు జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ మహిళా నాయకురాలు మాలతీరాణి ఎంపీని కలిశారు. ఆ తర్వాత చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి ఎంపీతో సమావేశమై, జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తన కుమార్తె జాహ్నవికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, జడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న మాగంటి బాబు కుటుంబ సభ్యులు, చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీ గురువారం ఎంపీని కలిసి మద్దతు కోరినట్లు తెలిసింది. నూజివీడుకు చెందిన అట్లూరి రమేష్, పోలవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు జగ్గవరపు ముత్తారెడ్డి తదితరులు కూడా ఎంపీని కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం.
తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నాయకులకు సూచించినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, కూటమి పార్టీల నాయకుల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. ఎక్కడైనా తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉంటే వారితో చర్చలు జరిపి, నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒప్పించాలని సూచించినట్లు వెల్లడించాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరఫున 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు సమష్టిగా పనిచేయాలని ఎంపీ పిలుపునిచ్చినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక, నాయకుల మధ్య సమన్వయం, అసంతృప్తుల బుజ్జగింపులపై జరుగుతున్న ఈ వరుస భేటీలు జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.