ప్రముఖ కవి రేపాక రఘునందన్‌కు సాహితీ పురస్కారం
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన ప్రముఖ కవి, అరసం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రేపాక రఘునందన్‌కు 2026 సంవత్సరానికి గాను కొండూరు వీర రాఘవాచార్యులు సాహితీ స్మారక పురస్కారం లభించింది. ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకులు ఈ పురస్కారాన్ని రఘునందన్‌కు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గత 44 సంవత్సరాలుగా కవితా రంగానికి విశేష సేవలందిస్తూ, సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్న రఘునందన్‌ను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుదీర్ఘకాలంగా సాహితీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న రఘునందన్‌కు ఈ పురస్కారం అందజేయడం పట్ల పలువురు సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చింతలూరి ఉమాదేవి, వల్లభాపురపు కృష్ణ కిషోర్, చింతలూరి సత్యనారాయణ, వసుధ బసవేశ్వరరావు, పీబీడీవీ ప్రసాద్, భవిరి శంకరనాథ్, వీర రాఘవాచార్యులు, తాతవోలు కనకమ్మ, పులవర్తి శ్రీనివాసరావు, ప్రవీణ్ కుమార్, ప్రముఖ కవయిత్రి మందరపు హైమవతి తదితరులు పాల్గొన్నారు. రఘునందన్‌కు ప్రతిష్ఠాత్మక సాహితీ స్మారక పురస్కారం లభించడం పట్ల తిరువూరు ప్రాంతానికి చెందిన సాహితీ అభిమానులు, కవులు, సాహితీవేత్తలు అభినందనలు తెలిపారు.