బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం!
- ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు భారీ వర్ష సూచన
- మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు
- ఉత్తరాంధ్రలో బలమైన గాలులు.. భారీ వర్షాలు
- మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలి
విశాఖపట్నం | ఎన్ టుడే న్యూస్:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. అక్టోబర్ 26 నాటికి ఇది తుపానుగా మారవచ్చని, 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే తుపాను తీవ్రత, దిశ, తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అంచనా. శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దక్షిణ ఒడిశా తీరంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సముద్ర పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చనే నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు.
కోత దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవడం వంటి చర్యలు చేపట్టాలని సూచన.
తుపాను కదలికలు, తీవ్రత, వర్షపాతం అంచనాల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు.