పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- పులుల సంరక్షణ, అడవి దున్నల పునఃప్రవేశంపై చర్చ
- సంప్రదాయ కళాకృతులు బహూకరణ
ఏపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధి అంశాలపై చర్చలు
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం భేటీ అయ్యారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన మోహన్ యాదవ్, మధ్యాహ్నం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు.
అనంతరం ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యాన్ని పెంపొందించే అంశాలపై చర్చ జరిగినట్లు వెల్లడించారు.
నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. వన్యప్రాణుల సంరక్షణతో పాటు జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా టైగర్ రిజర్వ్ పరిధిలో గౌర్ (అడవి దున్నలు) పునఃప్రవేశానికి సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
ఈ అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని చర్చించారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను పవన్ కళ్యాణ్ ఉప్పాడ పట్టు శాలువాతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ కళా సంపద, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా శ్రీరామ పట్టాభిషేకం కొండపల్లి కళాకృతిని, శ్రీకాళహస్తి కళాకారులు రూపొందించిన శ్రీ దుర్గాదేవి చిత్రపటాన్ని, అరకు కాఫీని బహూకరించారు.
అదేవిధంగా మోహన్ యాదవ్, పవన్ కళ్యాణ్‌కు శ్రీ ఓంకారేశ్వర స్వామి ప్రతిమతో పాటు జ్యోతిర్లింగ క్షేత్రం నుంచి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, అభివృద్ధి సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ భేటీ సాగింది.