ఏలూరు జెడ్పీ చైర్మన్ పదవికి పద్మవల్లీ దేవికి మద్దతు కోరిన మాగంటి దంపతులు
ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై కూటమిలో రాజకీయ కదలికలు ఊపందుకున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరఫున ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా మాగంటి పద్మవల్లీ దేవికి మద్దతు ఇవ్వాలని మాజీ మంత్రి, మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), పద్మవల్లీ దేవి దంపతులు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కోరారు.
ఏలూరులోని ఎన్ హోటల్‌లో నాదెండ్ల మనోహర్‌ను మాగంటి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మవల్లీ దేవి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా పరిషత్‌తో మాగంటి కుటుంబానికి మూడు తరాలుగా ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, జెడ్పీ చైర్మన్ పదవికి తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరినట్లు తెలిసింది.
జిల్లాలో కూటమిని మరింత బలోపేతం చేయడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగడం వంటి అంశాలపై నాయకుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జెడ్పీ చైర్మన్ పదవికి పద్మవల్లీ దేవి పేరును బలపరిచేందుకు మాగంటి దంపతులు చేస్తున్న ప్రయత్నాలు జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ సమావేశంలో ఉంగుటూరు జనసేన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, కైకలూరు జనసేన ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జనసేన అధ్యక్షుడిగా పనిచేసిన చినబాబు, కూటమి తరఫున ఏలూరు మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు, జనసేన సీనియర్ నాయకుడు, ఎన్ హోటల్, ఎన్ హోటల్ స్క్వేర్ అధినేత నారా శేషుతో పాటు కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.