మహిళను బెదిరించిన కేసులో వ్యక్తి అరెస్ట్
నగ్న చిత్రాలతో వేధింపులు.. కేసు ఉపసంహరించుకోవాలని బెదిరింపులు
మహిళను మోసం చేసి శారీరక సంబంధం కొనసాగించడంతో పాటు, కేసు ఉపసంహరించుకోవాలని బెదిరించిన ఆరోపణలపై రామన్నపేట మండలానికి చెందిన ముక్కామల దుర్గయ్య (49)ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం రామన్నపేట మండలానికి చెందిన ముక్కామల దుర్గయ్య తన భార్య చనిపోయిందని, తనకు ఎవరూ లేరని ఓ మహిళను నమ్మించి గత 12 సంవత్సరాలుగా ఆమెతో శారీరక సంబంధం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా, బలవంతంగా అబార్షన్ చేయించాడని బాధితురాలు అతనిపై అత్యాచారం కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణలో ఉండగానే దుర్గయ్య భార్య బతికే ఉందని, అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని బాధితురాలికి తెలిసింది. దీంతో ఇరువురి మధ్య వివాదం తలెత్తగా, బాధితురాలు న్యాయం కోసం పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని దుర్గయ్య ఫోన్ ద్వారా మహిళను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.అంతేకాకుండా తన సెల్ఫోన్లో ఉన్న ఆమె నగ్న చిత్రాలను ఇతరులకు చూపించి పరువు తీస్తానని, ఆమె కుమార్తెను చంపుతానని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుర్గయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రామన్నపేట ఎస్సై సతీష్ తెలిపారు.