అప్పుల భారం.. తిమ్మాపూర్ అటవీ ప్రాంతంలో వ్యక్తి మృతి
- ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మెదక్ జిల్లా | ఎన్ టుడే న్యూస్:
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకా గౌరీ నరసింహులు గౌడ్ (45) మృతి చెందాడు. అప్పుల భారం, పెరుగుతున్న వడ్డీల కారణంగా ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా తెలుస్తోంది.
నరసింహులు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు చెల్లెళ్ల వివాహాలు, కొత్త ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేసినట్లు సమాచారం. వాటిని తిరిగి చెల్లించలేక, వడ్డీలు పెరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
శనివారం స్వగ్రామానికి వెళ్లి వస్తానని భార్య, పిల్లలకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. అనంతరం తన కుమార్తెకు లొకేషన్ షేర్ చేసి, వాట్సాప్‌లో ‘బాయ్ అమ్ములు’ అంటూ సందేశం పంపినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.
అటవీ ప్రాంతంలో వెతకగా నరసింహులు చెట్టుకు వేలాడుతూ కనిపించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.