పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుళ్లకు వల.. రూ.24 లక్షలు కాజేసిన వ్యక్తి
- వ్యాపారవేత్తనంటూ నమ్మించి బెట్టింగ్ పెట్టుబడుల పేరుతో మోసం
- మరో 19 మంది మహిళా కానిస్టేబుళ్లను మోసం చేసినట్లు పోలీసుల గుర్తింపు
- పెళ్లి పేరుతో పరిచయం.. పెట్టుబడుల పేరుతో మోసం
- విలాసవంతమైన జీవితం పేరుతో నమ్మకం మరో 19 మంది బాధితులు
న్యూఢిల్లీ | ఎన్ టుడే న్యూస్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడుల పేరుతో ఓ మహిళా కానిస్టేబుల్ నుంచి రూ.24 లక్షలు కాజేసిన వ్యక్తి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, నిందితుడు మరో 19 మంది మహిళా కానిస్టేబుళ్లను కూడా ఇదే తరహాలో మోసం చేసినట్లు గుర్తించారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన విక్రాంత్ తోమర్ తాను వ్యాపారవేత్తనని చెప్పుకుంటూ కరోల్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌కు దగ్గరయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించాడు.
నిందితుడి మాటలు నమ్మిన బాధితురాలు తన వద్ద ఉన్న రూ.12 లక్షలతో పాటు మరో రూ.12 లక్షలు రుణంగా తీసుకుని మొత్తం రూ.24 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. చివరకు విక్రాంత్ తోమర్ వ్యాపారవేత్త కాదని తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది.
నిందితుడు సోషల్ మీడియాలో ఖరీదైన రెస్టారెంట్లు, భవనాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు ఫొటోలు, పోస్టులు పెట్టేవాడని దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. బాధితుల నమ్మకాన్ని పొందేందుకు కార్లను అద్దెకు తీసుకుని వారిని బయటకు తీసుకెళ్లేవాడని పోలీసులు గుర్తించారు.
కేసు దర్యాప్తులో భాగంగా విక్రాంత్ తోమర్ మరో 19 మంది మహిళా కానిస్టేబుళ్లను కూడా ఇదే తరహాలో మోసం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం అతడితో సహజీవనం చేస్తున్న మహిళ కూడా కానిస్టేబులేనని వెల్లడైంది. ఆమె ద్వారా ఇతర మహిళా కానిస్టేబుళ్ల వివరాలు తెలుసుకుని వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు, బాధితుల సంఖ్య, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.