వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం
పేదరికం వైద్య విద్యకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో గోలి ప్రణీత పింగల్ రెడ్డి దంపతుల చేయూత
భువనగిరి, అక్టోబర్ 23: పేదరికం ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో బీబీనగర్ మాజీ ఎంపీపీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి దంపతులు వైద్య విద్యార్థిని సోము నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. వైద్య విద్యను అభ్యసించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిఖితకు ఈ సాయం అందించి ప్రోత్సహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన సోము జంగయ్య, మాధవి దంపతుల కుమార్తె నిఖిత చదువులో ప్రతిభ కనబరిచింది. పదో తరగతిలో 10 జీపీఏ సాధించగా, ఇంటర్మీడియట్‌లో 1,000 మార్కులకు 989 మార్కులు సాధించింది. నీట్‌లో మంచి ర్యాంకు సాధించి పటాన్‌చెరువులోని మహేశ్వర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది.
అయితే వైద్య కళాశాల ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో గోలి ప్రణీత పింగల్ రెడ్డి దంపతులు నిఖితకు అండగా నిలిచారు. రూ.50 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు శాలువాతో సన్మానించి ఆమెను అభినందించారు.
ఈ సందర్భంగా గోలి ప్రణీత పింగల్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గోలి పింగల్ రెడ్డి, సాయి సంతోష్ హైస్కూల్ కరస్పాండెంట్ ఈసారపు అచ్చయ్య గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అక్బర్, పింగల్ అన్న సేవాదళ్ అధ్యక్షుడు ఎండీ మోయిన్, నాయకులు ఎలుగుల నరేందర్, కాసుల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.