నూజివీడు మండలంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు
200 మంది కార్యకర్తలతో వైసీపీలో చేరిన దేవరగుంట మాజీ ఉప ఎంపీపీ, సర్పంచ్ తాళం వెంకటేశ్వరరావు
నూజివీడు: నూజివీడు మండలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేవరగుంట గ్రామానికి చెందిన మాజీ ఉప మండల పరిషత్ అధ్యక్షుడు, సర్పంచ్ తాళం వెంకటేశ్వరరావు సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు, తన అనుచరులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ద్వారకా ఎస్టేట్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సమక్షంలో తాళం వెంకటేశ్వరరావు, ఆయన అనుచరులు వైసీపీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కూటమి ప్రభుత్వ పాలన తీరు నచ్చకపోవడంతోనే తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తాళం వెంకటేశ్వరరావు, ఆయన అనుచరులు వెల్లడించినట్లు సమాచారం. స్థానికంగా రాజకీయ ప్రాధాన్యం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందిన తాళం వెంకటేశ్వరరావు తన అనుచరులతో కలిసి పార్టీ మారడం నూజివీడు మండల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు పల్నాటి రఘు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నక్క శ్రీనివాసరావు, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.