నూజివీడు ఎన్నికల ప్రచారంలో మంత్రి కుటుంబం..
- వార్డుల్లో సందడి ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన
నూజివీడు, అక్టోబర్ 24: నూజివీడు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సభ్యులు పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి కొలుసు పార్థసారథి, ఆయన భార్య కమలాలక్ష్మి, కుమారుడు నితిన్ కృష్ణ వేర్వేరు వార్డుల్లో ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం సాగించారు. మంత్రి పార్థసారథి 18, 24, 33వ వార్డుల్లో పర్యటించగా, కమలాలక్ష్మి 25వ వార్డులో, నితిన్ కృష్ణ 27వ వార్డులో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో స్థానికులు మంత్రి కుటుంబ సభ్యులకు ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి, నుదుటన కుంకుమ తిలకం దిద్ది తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజలతో మమేకమవుతూ సాగిన ప్రచార కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో సందడిని నెలకొల్పాయి. ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి కుటుంబ సభ్యులు, పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించడంతో పాటు రహదారులు, మురుగునీటి కాలువలు, తాగునీరు వంటి మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, నూజివీడు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కుటుంబ సభ్యులు నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించడం స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.