మంచిర్యాలలో ఉచిత కంటి వైద్య పరీక్షల మొబైల్ వ్యాన్ ప్రారంభం
గ్రామీణ, మారుమూల ప్రాంతాల పేదలకు నేత్ర వైద్య సేవలు అందించడమే లక్ష్యం: రఘునాథ్ వెరబెల్లి
మంచిర్యాల: రాందేవ్ సేవా సమితి సహకారంతో న్యూ పవన్ ఆప్టికల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య పరీక్షల సంచార వాహనాన్ని మంచిర్యాల పట్టణంలోని గర్మిళ్ల హనుమాన్ దేవాలయం వద్ద ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ బద్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు అందించేందుకు ఈ సంచార వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వైద్య సేవలను ప్రజలకు నేరుగా అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సేవా కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులను ఆయన అభినందించారు.
పేద ప్రజలకు మెరుగైన నేత్ర వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా అనేకమందికి ప్రయోజనం కలుగుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, నాయకులు కస్తూరి నాగరాజు, పట్టి వెంకట కృష్ణ, అమిరిశెట్టి రాజ్ కుమార్, ఆడే ప్రేమ్ సింగ్, వైద్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.