చింతలపూడి మండలంలో ముగిసిన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ
మండలంలో మొత్తం 122 నామినేషన్లు.. పార్టీల మధ్య హోరాహోరీ పోరు
ఏలూరు జిల్లా, చింతలపూడి: చింతలపూడి మండలంలో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. చివరి రోజున 64 నామినేషన్లు దాఖలు కావడంతో మండలంలో మొత్తం నామినేషన్ల సంఖ్య 122కు చేరింది. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడంతో మండలంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
పార్టీల వారీగా ఇప్పటివరకు దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి 39, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 43, కాంగ్రెస్ పార్టీ నుంచి 19, జనసేన పార్టీ నుంచి 14, భారతీయ జనతా పార్టీ నుంచి 2, సీపీఐ నుంచి 2, స్వతంత్ర అభ్యర్థులుగా 2 నామినేషన్లు దాఖలయ్యాయి.
మండలంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులు తమ విజయావకాశాలపై అంచనాలు వేసుకుంటూ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచార పర్వంపై పార్టీల దృష్టి కేంద్రీకృతం కానుంది. గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో చింతలపూడి మండలంలో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కే అవకాశముంది.
చింతలపూడి మండలంలో ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 122 నామినేషన్లు దాఖలైనట్లు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వై. సుబ్బారావు వెల్లడించారు.