నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. శ్రీనివాసులు
రొంపిచర్ల: మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి కె. శ్రీనివాసులు తెలిపారు.
సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిబంధనలను పర్యవేక్షించేందుకు ఎంసీసీ, ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలను ఏర్పాటు చేశామని, ఆయా బృందాలకు శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన, 27వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించి, అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు.
వచ్చే నెల 3వ తేదీన పోలింగ్ నిర్వహిస్తామని, అవసరమైతే 4వ తేదీన రీపోలింగ్ చేపడతామని తెలిపారు. 5వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కె. శ్రీనివాసులు సూచించారు.