5 నెలల గర్భంతో ఉన్న లివ్-ఇన్ పార్ట్‌నర్ హత్య..
- ఐదు నెలల గర్భిణీ హత్య.. అద్దె ఇంట్లో మృతదేహం వదిలి ప్రియుడు పరార్!
- కుటుంబాలను వదిలి సహజీవనం
- అద్దె ఇంట్లో మృతదేహం
- ప్రియుడి కోసం పోలీసుల గాలింపు
రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఘటన.. మహిళ మెడపై గాయాల గుర్తులు, ఘటనా స్థలంలో విరిగిన మొబైల్ ఫోన్
అల్వార్: రాజస్థాన్‌లోని అల్వార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణీగా ఉన్న 28 ఏళ్ల మహిళ అద్దె ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమెతో సహజీవనం చేస్తున్న 25 ఏళ్ల వ్యక్తి ఘటన అనంతరం కనిపించకుండా పోవడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. మహిళ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతురాలు కుమ్‌కుమ్, యోగేష్ చౌదరి ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా గోవర్ధన్ ప్రాంతానికి చెందినవారు. వీరిద్దరికీ గతంలో వేర్వేరు వ్యక్తులతో వివాహాలు జరిగాయి. ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. సుమారు ఏడాదిన్నర క్రితం తమ కుటుంబాలను విడిచిపెట్టి అల్వార్‌లో కలిసి జీవించడం ప్రారంభించారు.
కుమ్‌కుమ్ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కంటెంట్ క్రియేటర్‌గా కొనసాగుతుండగా, యోగేష్ ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది.
వారు నివసిస్తున్న అద్దె ఇంట్లో కుమ్‌కుమ్ మృతదేహాన్ని ఇంటి యజమాని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమె మెడపై గుర్తులు కనిపించడంతో పాటు, అక్కడ విరిగిపోయిన మొబైల్ ఫోన్ కూడా లభించినట్లు సమాచారం.
మృతదేహాన్ని వైద్య పరీక్షలకు పంపించగా, కుమ్‌కుమ్ ఐదు నెలల గర్భిణీ అని వెల్లడైనట్లు తెలిసింది. ఆమె మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యోగేష్ గతంలో విడిచివచ్చిన భార్య కూడా గర్భవతిగా ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యోగేష్, కుమ్‌కుమ్ మధ్య ఏదైనా వివాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, వారి మధ్య గొడవే హత్యకు కారణమని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
ఘటన తర్వాత యోగేష్ కనిపించకుండా పోవడంతో పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అతడి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాలు, పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే కుమ్‌కుమ్ మృతికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.